రేపు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు అన్ని పూర్తి – టీటీడీ ఈవో జవహర్ రెడ్డి

రేపు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ జరగనున్న నేపథ్యంలో కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. రేపు రాత్రి జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి సీఎం జగన్ హాజరవుతున్నందున కల్యాణ వేదిక ఏర్పాట్లను జవహార్ రెడ్డితోపాటు కలెక్టర్ విజయరామరాజు, ఇతర జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించినట్లు తెలియజేసారు.
కల్యాణ మండపం ప్రాంగణంలో 53 వేల మంది కూర్చొని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని , సీఎం కూర్చునే వేదిక, భక్తుల గ్యాలరీలు ఇతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఒంటిమిట్ట కల్యాణానికి వస్తున్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు మీడియా కు తెలిపారు. రేపు రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది.
ఇక రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి.అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం శ్రీరామ నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు జరిపిస్తారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.