కంటోన్మెంట్ అధికారుల‌తో కేటీఆర్ భేటీ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ..ఈరోజు మంగళవారం కంటోన్మెంట్ అధికారుల‌తో భేటీ అయ్యారు. ఆర్మీ దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ సహా ఇతర ఉన్నతాధికారులు నానక్‌రాం గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.

నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, కంటోన్మెంట్‌కి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. మెహదీపట్నం కంటోన్మెంట్ ఏరియాలో వరద కాల్వ సమస్యపై కూడా ఇరువర్గాలు చర్చించాయి. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఉమ్మడిగా ఇన్‌స్పెక్షన్ చేసేందుకు ఆర్మీ అధికారులు సమ్మతించారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత‌ హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వ‌సతుల క‌ల్ప‌నకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా న‌గ‌రం న‌లుదిక్కులా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాల్లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రిగింద‌ని కేటీఆర్ అన్నారు. అయితే స్కైవేల నిర్మాణం విష‌యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌న్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు ప‌లుమార్లు క‌లిసి విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ ఎలాంటి స్పంద‌న లేద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ప‌దేప‌దే రోడ్ల‌ను మూసివేయ‌డంతో.. స్థానిక ప్ర‌జ‌ల‌కు అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని కేటీఆర్ ఆర్మీ అధికారుల‌కు వివ‌రించారు.