టీఎస్ ఆర్టీసీ బాటలోనే ఏపీఎస్ ఆర్టీసీ..చార్జీలు పెంచబోతుందా..?

ఏపీఎస్ ఆర్టీసీ సైతం ప్రయాణికుల ఫై భారం మోపేందుకు సిద్దమైందా..అంటే అవుననే తెలుస్తుంది. రీసెంట్ గా టీఎస్ ఆర్టీసీ పలు కారణాలు చెప్పి ప్రయాణికుల ఫై చార్జీల భారం మోపిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా టికెట్ ధరలు పెంచడం ఫై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏపీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు తక్కువ గా ఉండడం తో అందులోనే ప్రయాణించేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.

ఈ క్రమంలో అంతరాష్ట్ర ఒప్పందం మేరకు తెలంగాణలో తిరిగే ఏపీ సర్వీసుల్లో చార్జీలు పెంచాలంటూ ఇటీవల టీఎస్‌ ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. ఇదే సమయంలో లేఖకు ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించని పక్షంలో సర్వీసు క్రమబద్దీరకరణపై దృష్టిసారించనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేయడంతో సమస్యను అధిగమించడంపై అధికారులు దృష్టిసారించారు. ఒప్పందం మేరకు ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది.

టీఎస్‌ ఆర్టీసీ ఈ నెల 9న రెండోసారి డీజిల్‌ సెస్‌ పెంచడంతో చార్జీలు గణనీయంగా పెరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో చార్జీల్లో రూ.30 నుంచి రూ.120 రూపాయల వరకు వ్యత్యాసముంది. టీఎస్‌ ఆర్టీసీ చార్జీలు అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఏపీ సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు.

గత వారం రోజుల వ్యవధిలో తెలంగాణ సర్వీసుల ద్వారా ఏపీఎస్‌ ఆర్టీసీ గణనీయమైన ఆదాయం పొందుతోంది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) 85శాతం పైబడి వస్తుండగా ఈపీకే(ఎర్న్‌ పర్‌ కిలో మీటర్‌) రూ.50 దాటింది. రోజువారీ ఆదాయం కూడా రూ.కోటి 25లక్షల మార్కు దాటడంతో అధికారులు ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌ ఆర్టీసీ ప్రతిపాదనలు ఏపీ అధికారుల ఆనందంపై నీళ్లు జల్లాయి. అంతరాష్ట్ర ఒప్పందంపై టీఎస్‌ ఆర్టీసీ అధికారులు గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు 535 వరకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.

తక్కువ చార్జీలు, నిర్వహణ పరంగా ఏపీ బస్సులు మెరుగ్గా ఉండటంతో అక్కడి ప్రయాణికులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకు అనుగుణంగానే ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు టీఎస్‌ ఆర్టీసీ చార్జీలు పెంచాలంటూ మెళిక పెట్టడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తుంది.