మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తులు

నేడు దరఖాస్తులకు ఆఖరు రోజు

wine shop
wine shop

హైదరాబాద్: మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఒక్కో షాపుకు ఆరు నుంచి 10 మందికి పైగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఉన్న ప్రదేశాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. దీంతో చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని 2,216 షాపులకు గాను మంగళవారం ఒక్కరోజే 9788 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 20,630కి చేరింది. వీటితో ఇప్పటికే రూ.412.60 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి స్పందన బాగుందని, కొత్త ఔత్సాహికులు దరఖాస్తులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో వచ్చిన 40 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న జిల్లాల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయని ఒక అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో నల్లగొండ 3809, వరంగల్ జిల్లాలో 4050, రంగారెడ్డిలో 3169, ఖమ్మంలో 3469 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా మద్యం వ్యాపారంలో ఈసారి కొత్త వ్యక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాపారంలోకి కొత్తవారు రాకుండా ఇప్పటికే లైసెన్సులున్న రిటైలర్లు సిండికేట్‌గా ఏర్పడి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ డివిజన్‌లో మొత్తం 173 మద్యం దుకాణాలకు కూడా 413 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/