ఏపీలో రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు

ఏపీలో రేపటి నుండి పదో తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. రేపటి నుండి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈసారి మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3800 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరగనున్నాయి.

పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. ఆలస్యం అయితే అనుమతించం అని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానంద రెడ్డి తెలిపారు. ఒక్కో రూముకు 16 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాటు చేసారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలానే మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 292 సిట్టింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇక విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయం, ఏఎన్‌ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. అలాగే ఈ ఏడాది పదవ తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతోపాటు గా, తొలిసారి సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ను అందిస్తున్నారు.