‘E-వాచ్’‌ యాప్‌ను ఆవిష్కరించిన ఎస్‌ఈసీ

విజయవాడ: ఏపి పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులు, ఇతర వివరాలు, సమాచారం కోసం యాప్ ను రూపొందించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలతో పాటు ఫోటోలను కూడా అప్ లోడ్ చేసే అవకాశముందని తెలిపారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకే యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు, దాడులను అరికట్టేందుకు యాప్ ను రూపొందించారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ఓటర్లకు పటిష్ట భద్రతను ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నామన్నారు. యాప్ కు తోడు ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామని నిమ్మగడ్డ తెలిపారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇందులో కొత్తగా ఏమీ లేదని.. టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిమ్మగడ్డ వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/