వరదలతో రాష్ట్రంలో 24 మంది చనిపోయారని ఏపీ సర్కార్ ప్రకటన

గత కొద్దీ రోజులుగా ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యముగా కరువు ప్రాంతమని చెప్పుకునే రాయలసీమ లో అత్యధిక వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు భారీ ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తేల్చింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 24 మంది మృతిచెందగా.. 17మంది గల్లంతైనట్టు గుర్తించారు. నాలుగు జిల్లాల్లో కలిపి 23,345 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు తెలిపింది. 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7కోట్లు విడుదల చేసింది.

ఈ వర్షాల వల్ల తిరుమల దేవస్థానానికి రూ.4కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో గత 30 ఏళ్లలో ఎప్పుడూలేనంత వర్షం పడిందన్నారు. తిరుమలలో జరిగిన నష్టం వివరాలను ఆయన వివరించారు. ‘‘ఘాట్‌ రోడ్‌లోని 13చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్‌ రోడ్డులో ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఘాట్‌రోడ్లు, మెట్ల మార్గంలో వెంటనే మరమ్మతు పనులు చేపడతాం. నారాయణగిరి అతిథి గృహం, కపిలతీర్థం మండపం దెబ్బతిన్నాయి. తిరుమల వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తాం’’ అని ఆయన అన్నారు.