ఏపీ ప్రజలకు రెయిన్ అలెర్ట్…

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగాల 48 గంటల్లో ఏపీలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.

ఇక చెన్నై లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్యం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం సాయంత్రం సమీక్షాసమావేశం నిర్వహించారు. రుతుపవనాల రాకతో గత నెల 28 నుంచి ఈనెల 3వ తేదీ వరకు డెల్టా, కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తింది. ఆ సమయంలో 42 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని, మరో రెండు వారాల్లో భారీ, అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధనకేంద్రం ముందుగానే హెచ్చరించింది.