బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. నేడు ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది.

ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు మరియు రేపు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచును.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇక ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి.