ఏపీలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. 2021 కి గుడ్ బై చెప్పి 2022 కు గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు అంత సిద్ధమవుతున్నారు. అయితే కరోనా , ఓమిక్రాన్ వైరస్ కారణంగా పోలీసులు పలు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు ఆంక్షలు విధించగా..ఏపీలోనూ పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

ఈరోజు రాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఉండనున్నట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. బందరు, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్లు, పైవంతెనలు మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. 15 చోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే విశాఖ లో డిసెంబరు 31 సాయంత్రం 6గంటల నుంచి సాగరతీరంలో ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు.

ఇక మద్యం అమ్మకాల విషయంలో పలు మార్పులు చేసి మందుబాబులకు ఊరట కల్పించారు. ఈరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాల్లో విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లకు అర్ధరాత్రి 12 గంటల వరకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.