ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు : మొదటి బోణి కొట్టిన వైసీపీ

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైయస్సార్ జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించి మొదటి బోణి కొట్టారు. వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లె ఎంపిటిసి 221 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఇన్ వాలిడ్ 17, టిడిపి – 5, వైసిపి – 191 కి వచ్చాయి. దీంతో 186 ఓట్లమెజారిటీ తో వైసిపి అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు.

ప్రస్తుతం అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా బ్యాలెట్ బ్యాక్స్‌లకు చెదలు పట్టాయి. సరుబుజ్జిలి మండలం షలంతరి ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ బూత్‌, ఆమదాలవలస నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌కు చెదలు పట్టాయి. దీనితో ఆ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లాఠకర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం జేసీ సుమిత్ కుమార్ అద్వర్యంలో చెదపట్టిన బూత్‌లోని బ్యాలెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

గుంటూరు జిల్లా లూథరన్‌ బీఎడ్‌ కళాశాలలో ఉంచిన కొన్ని బ్యాలెట్‌ బాక్సుల్లో పేపర్లు తడిచిపోయాయి. తాడేపల్లి మండలం బేజాతపురం, రావెల ఎంపీటీసీ స్థానాల ఓట్లు తడిచాయి. దీంతో ఓట్ల లెక్కింపు సిబ్బంది వాటిని బయటకు తీసి ఆరబెడుతున్నారు. బ్యాలెట్లు తడవడంతో లెక్కింపునకు ఇబ్బంది అవుతుందని ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై లెక్కింపు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో నోటీఫికేష‌న్ విడుద‌ల కాగా.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7220 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. నేడు వారి భ‌విత్వం తేల‌నున్న‌ది.