ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మార్చి 13న ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఏకంగా 37 మంది ఉన్నారు. టీడీపీ మద్దతులో వేపాడ చిరంజీవిరావు, వైస్సార్సీపీ మద్దతుతో సీతంరాజు సుధాకర్‌, బీజేపీ తరపున సిటింగ్‌ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌, వామ పక్షాల అభ్యర్థిగా కె.రమాప్రభ పోటీ చేయనున్నారు.

మిగిలిన అభ్యర్థులంతా ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఐదుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జిల్లావాసులే. కానీ చాలామంది అభ్యర్థుల పేర్లు పట్టభద్రులకు తెలియకపోవడం గమనార్హం. వీరు ప్రచారం కూడా చేయకపోవడం విశేషం. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా కూడా ఓటర్లకు చేరువవుతున్నారు.