మంత్రి పేర్ని నానితో సినీ ప్ర‌ముఖుల స‌మావేశం

ఏపీలోని స‌చివాల‌యంలో చ‌ర్చ‌లు
ఆన్‌లైన్‌ టికెట్ల విక్ర‌యాల అంశంపై భేటీ

అమరావతి : ఏపీ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌నిక‌రించాల‌ని మెగాస్టార్ చిరంజీవి వేడుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి పేర్ని నానితో ఆన్‌లైన్‌ టికెట్ల విక్ర‌యాల అంశంపై మాట్లాడడానికి థియేట‌ర్ల య‌జ‌మానులు స‌మావేశ‌మ‌య్యారు. అంతేగాక‌, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఇందులో పాల్గొని చ‌ర్చిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కల్యాణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దాన‌య్య‌ రామసత్యనారాయణ, పంపిణీ దారులు మంత్రితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఏపీ స‌చివాలయంలో ఈ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి జగన్ తో ఉంటుంద‌ని ముందుగా అంద‌రూ భావించారు.

ఈ స‌మావేశానికి చిరంజీవితో పాటు ప‌లువురు సినీ పెద్దలు హాజరవ్వాల్సి ఉంది. అయితే, ప‌లు కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. మొద‌ట సినీ నిర్మాత‌లు, థియేట‌ర్ల యజ‌మానుల‌తో నాని చ‌ర్చిస్తార‌ని, అనంత‌రం జ‌గ‌న్‌తోనూ స‌మావేశం ఉంటుంద‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్‌ను తామందరం త్వ‌ర‌లోనే కలుస్తామని, ఇందుకు ముహూర్తం ఖ‌రారు కావాల్సి ఉంద‌ని చిరంజీవి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/