ఉద్యోగులు ముందుకు వస్తేనే చర్చలు : మంత్రి బొత్స

జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదు..ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం

అమరావతి: పీఆర్సీ అంశం పరిష్కారం కోసం ప్రభుత్వమే చొరవ తీసుకుని చర్చలకు పిలుస్తుంటే ఉద్యోగులకు అలుసుగా మారిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో బొత్స కూడా ఉన్నారు. చర్చలకు ఉద్యోగులు రాకపోవడం పట్ల ఆయన స్పందిస్తూ, ఏ అంశమైనా చర్చలతోనే పరిష్కారం అవుతుందన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అన్నారు. మొండిపట్టుదలకు పోతే ఎవరికి నష్టం? అని ప్రశ్నించారు. చర్చలకు రాకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

ఉద్యోగులు ఇకనైనా అపోహలు వీడాలని, జీతం ఒక్క రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేశారు. జీతం పెరుగుతుందో, తగ్గుతుందో పే స్లిప్ చూసుకోవాలని హితవు పలికారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్య ప్రభుత్వ సమస్యే అవుతుందని బొత్స పేర్కొన్నారు. ఉద్యోగులు ఎప్పుడు వచ్చినా చర్చలకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అయితే ఇకమీదట రోజూ సచివాలయానికి వచ్చి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తూ కూర్చోబోమని, చర్చలకు సిద్ధమని ఉద్యోగులు ప్రకటిస్తేనే తాము వస్తామని తేల్చి చెప్పారు. ఇవాళ కొందరు ఉద్యోగ సంఘ నేతలు వచ్చి తమను కలిశారని బొత్స వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/