ఆస్తులు అమ్ముకుని ప్రజాసేవ చేస్తున్నా:మంత్రి అనిల్ కుమార్

ఆరోపణలు చేయడం సరికాదు

అమరావతి: తాను ఆస్తులు సంపాదించుకుంటున్నానంటూ వస్తున్న ఆరోపణలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నిజానికి తాను ఆస్తులు కరగబెట్టుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. నెల్లూరులోని సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నానని, ఆస్తులు కూడబెట్టుకుంటున్నానని కొందరు ఏవోవో మాట్లాడుతున్నారని అన్నారు. నిజానికి తాను ఆస్తులు కూడబెట్టుకోవడం లేదని, తన తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల విలువ చేసే ఇస్కాన్ సిటీలోని ఆస్తులను అమ్మి ప్రజా సేవలో కొనసాగుతున్నానని అన్నారు. తానేమీ కొత్తగా ఇల్లు కట్టుకోలేదని, తన తండ్రి నిర్మించిన ఇంటికే కొన్ని మార్పులు చేసినట్టు వివరించారు.

రూ. 85 కోట్లతో టెండర్లు పిలిచి సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులు చేయిస్తుంటే ఆ పనులు తనవేనని ప్రచారం చేయడం సరికాదన్నారు. పెన్నాబ్రిడ్జి కోసం రూ. 100 కోట్లతో టెండర్లు పిలుస్తామని, దమ్ముంటే టెండరు వేసుకోవాలని మంత్రి సవాలు విసిరారు. అలాగే, కార్పొరేషన్ అభివృద్ధి పనులకు కూడా టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/