అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి

అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత

అమరావతి: వివాదాస్పద వ్యాఖ్యలకు ఇటీవల కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడమే అత్యాచారాలకు కారణమని ఇటీవల వ్యాఖ్యానించిన మంత్రి.. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని తాజాగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న గుంటూరు వచ్చిన వనిత మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించారు.

దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడే ఉద్దేశంతో రాలేదన్నారు. మద్యం మత్తులో ఉన్న వారు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారని, భర్తను రక్షించుకోవడానికి ఆమె వెళ్లినప్పుడు నిందితులు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైనట్టు చెప్పారు. పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. ఆమెపై అత్యాచారానికి, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదన్నారు. కాగా, అత్యాచార ఘటనలపై మంత్రి వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/