ఏపి స్పీకర్ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం
రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న హైకోర్టు

అమరావతి: ఏపి స్పీకర్ తమ్మినేని సీతారం న్యాయవ్యవస్థను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని… బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది.
న్యాయస్థానాలపై మీడియా, సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైఎస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. స్పీకర్ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అయితే సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/