సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించడంలో తప్పు ఏముంది ?

థియేటర్ల యాజమాన్యాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

అమరావతి: ఆన్ లైన్ లో సినిమా టికెట్లను ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ లో ప్రభుత్వం టికెట్లను విక్రయించడం గుత్తాధిపత్యానికి దారితీస్తుందని, ఇది తమ ప్రాథమిక హక్కులను హరించడమేనని థియేటర్ల యాజమాన్యాలు వాదనలు వినిపించాయి. ప్రజలకు ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ తెలియదని పేర్కొంది. కానీ, ఈ వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు.

సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించడంలో తప్పు ఏముందని, ఇందులో హక్కులను హరించేది ఏముంటుందని ప్రశ్నించింది. ప్రజలకు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవడమే కాకుండా, ఆన్ లైన్లో సినిమా చూడడం కూడా తెలుసని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/