TDP ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ఊరట

హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట దక్కింది. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 16 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంపై 2021, అక్టోబర్ 19న కొందరు దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీ, టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించారు. ఇదిలా ఉంటె సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిరమేష్‌కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది.