అమరావతి అందరికీ రాజధాని అవుతుందన్న సీజే

ఏపీ రాజధానిపై గత రెండ్రోజులుగా వాదనలు

అమరావతి: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని అంటే కర్నూలు, వైజాగ్ ఇలా అన్ని ప్రాంతాలకు రాజధాని అని పేర్కొన్నారు. ఆ విధంగా ఏపీ రాజధాని అమరావతి రైతులకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అందరికీ రాజధాని అవుతుందని అభిప్రాయపడ్డారు.

నాడు స్వాతంత్ర్య సమరయోధులు తమ కోసం తాము పోరాడలేదని, వారు దేశ ప్రజలందరి స్వాతంత్ర్యం కోసం పోరాడారని సీజే ప్రశాంత్ కుమార్ ఉదహరించారు. దేశానికి లభించిన స్వాతంత్ర్యం స్వాతంత్ర్య సమరయోధులకు మాత్రమే సొంతం కాలేదని, దేశ ప్రజలదరికీ ఆ స్వాతంత్ర్యం లభించిందని వివరించారు. అమరావతి కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

ఏపీలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో 100కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ గతంలోనే ప్రారంభం కాగా తొలుత జేకే మహేశ్వరి, ఆ తర్వాత అరూప్ గోస్వామి సీజేలుగా వ్యవహరించారు. కానీ వారు విచారణ మధ్యలోనే బదిలీ అయ్యారు. తాజాగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో విచారణ షురూ అయింది. ఈ పిటిషన్లపై గత రెండ్రోజులుగా వాదనలు జరుగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/