ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం ఎక్కడిది?

వైస్సార్సీపీ ప్రభుత్వానిది తుగ్లక్ నిర్ణయం: అయ్యన్నపాత్రుడు

అమరావతి: విశాఖలో విలువైన ప్రజా ఆస్తులను వైస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టడం దారుణమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇవన్నీ ప్రజల ఆస్తులని, వాటిని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటని ప్రశ్నించారు. పోలీస్ క్వార్టర్స్, గోపాలపట్నం రైతు బజార్, సర్క్యూట్ హౌస్, పాలిటెక్నిక్ కాలేజీ, తహశీల్దార్ కార్యాలయం, ఐటీఐ కాలేజీ తదితర 13 విలువైన ఆస్తులను రూ. 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించాలని చెప్పారు. ఏ2 విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలోని ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/