ప్రకాశంజిల్లావాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది

ప్రకాశం జిల్లా వాసుల చిరకాల కోరిక ఏమైనా ఉందా అంటే అది జిల్లాలో విశ్వవిద్యాలయం. ఎప్పటి నుండి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉంటె బాగుండు అని అనుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్న వారి కోరిక మాత్రం కోరికలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేర్చింది. తమ ప్రభుత్వం యూనివర్సిటీ ప్రాధాన్యతను గుర్తించి సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో ఏర్పాటుకు ప్రతిపాదించిందని మంత్రి సురేష్ తెలిపారు.

గత ప్రభుత్వం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేవలం జీవో ఇచ్చిందని , కానీ కనీసం వీసీ పోస్టు కూడా మంజూరు చేయలేదని అసెంబ్లీ వేదిక గా చెప్పారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టం 1991కు సవరణ చేస్తూ 2021 సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే శాసనసభ ఆమోదించగా గురువారం మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే స్థల సేకరణ చేశామని, అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.

ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఉపాధ్యాయ విద్యను ఉన్నత విద్యలోకి చేర్చే అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా ఒక శిక్షణ కేంద్రాన్ని స్థాపించి, అధ్యాపక విద్య నాణ్యతను పెంచడం ద్వారా నాణ్యమైన అధ్యాపకులను తయారు చేయాలని అనేది లక్ష్యమని మంత్రి చెప్పారు.