పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు అందించారు. రీసెంట్ గా ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ కావడం తో విద్యార్థులు మనోవేదనకు గురయ్యారు. పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీనిపై విపక్షాలు సైతం ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శలు చేసింది. ఈ తరుణంలో జగన్ ఫలితాలపై సమీక్షా జరిపి విద్యార్థులకు తీపి కబురు తెలిపారు.

ఫస్ట్ టైం పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశమిచ్చారు. ఇప్పటివరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్‌ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్‌ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.

ఇక ఈరోజు విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి రెండో దశ కింద అన్ని స్కూల్స్‌లో పనులు మొదలు కావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండాలన్నారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం పోటీపడుతున్నామని, స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలన్నారు. ఆ మేరకు సన్నద్దంగా ఉండాలని, బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ లేదా కేజీబీవీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలన్నారు.