ఏపీలో మరో ఆరు కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీ

ఏపీలో మరో ఆరు కొత్త మండలాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరంలను అర్బన్, రూరల్ మండలాలుగా పేర్కొంది. ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో మార్పులు చేయలేదు. వాటి పరిధిని పెంచలేదు. రెవెన్యూపరంగా మరింత సుపరిపాలనను అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది.

మచిలీపట్నం విషయంలో మాత్రం కొత్త గ్రామాలను కలుపుకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొంది. వాటిని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది. 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తించింది. ఈ తాజా ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని 30 రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేయాలని తెలిపింది.