ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు రద్దు

గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు

అమరావతి: ఏపీ ప్ర‌భుత్వం పోటీ పరీక్షల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఈ రోజు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ నియామకాల్లో ఇక‌పై రాత పరీక్షల్లో ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఏపీపీఎస్సీ నిర్వ‌హిస్తోన్న ఉద్యోగ నియామకాల రాత‌ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థుల్లో ఒత్తిడిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ విష‌యంలో పూర్తి పారద‌ర్శ‌క‌తతో వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు తొల‌గించాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/