మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు

మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 3న చురచంద్‌పూర్ జిల్లా టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. తెలుగు విద్యార్థులను, పౌరుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.

అలాగే ఏపీ ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ఓ విమానాన్ని ఏర్పాటు చేయగా.. ఇంపాల్ నుంచి కోల్‌కతాకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏయిర్‌పోర్ట్‌లలో ల్యాండ్ అయిన తర్వాత కూడా తమ స్వస్థలాలకు పంపించనున్నారు. ఈరోజు ఉదయం 9.35 AM గంటలకు 108 మంది విద్యార్థులు బయలుదేరనున్నారు. మరోవైపు ఉదయం 11.10 AM గంటలకు 49 మంది విద్యార్థులు కోల్‌కతాకు వెళ్లనున్నారు.