ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ప్రసంగించారు. సమావేశాలకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, లీడ‌ర్ ఆఫ్ ది హౌస్‌, సీఎం జగన్, మంత్రులు, అధికార సభ్యులు, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు హాజరయ్యారు. అంత‌కుముందు అసెంబ్లీకి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌స్వాగతం ప‌లికారు.

ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని.. నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామని.. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు అభివృద్ధి చెందుతున్నాయని.. 2020-21లో జీఎస్‌డీపీ వృద్ధి రేటులో ఏపీ నెంబర్‌ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించామని.. అలాగే45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు.

2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు.. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశామన్నారు. నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం.. 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు.. వైఎస్సార్‌ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశామన్నారు.

నాడు- నేడుతో స్కూళ్ల ఆధునీకరణ, మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి వచ్చాయన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు.. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్‌ పింఛన్‌ కానుక అందజేస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని గుర్తు చేశారు.