పీఆర్సీపై కొత్త జీవోలు, సీసీఏ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం

జనవరి 1 నుంచే అమల్లోకి

అమరావతి: సిటీ కాంపన్సేటరీ అలవెన్సు (సీసీఏ)ను రద్దు చేయడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. దానిని పునరుద్ధరిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. పీఆర్సీ అమలు కోసం ఈ ఏడాది జనవరి 17న ఏపీ ప్రభుత్వం సీసీఏను రద్దు చేసింది. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న సీసీఏను రద్దు చేయడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమం చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. రద్దు చేసిన సీసీఏను పునరుద్ధరించేందుకు అంగీకరించింది. మంత్రుల కమిటీ హామీ మేరకు గత ఉత్తర్వులను సవరించారు. ఉద్యోగులకు వారి పే ఆధారంగా సీసీఐ వర్తిస్తుంది. అయితే, ఏపీ ఉన్నత జుడీషియల్ సర్వీసెస్, రాష్ట్ర జుడీషియల్ సర్వీసెస్ వారికోసం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తారు.

సవరించిన వేతనం ఆధారంగా రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు, విశాఖపట్టణం, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాల్లో పనిచేసే వారికి మూడు కేటగిరీల్లో సీసీఏ చెల్లిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/