ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేధాన్ని వాయిదా వేసిన ఏపీ సర్కార్

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన ఏపీ సర్కార్..ఆ నిషేధాన్ని వాయిదావేసింది. ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నవంబర్ 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సవరిస్తూ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఆమధ్య విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్… నగరంలో వెలసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను చూసి.,. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులుగా వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు దానిని జనవరి 26 కు మార్చారు. మరి అప్పుడైనా అమల్లోకి తీసుకొస్తారో లేదో చూడాలి.