ఏపీ బడ్జెట్ కి తుదిమెరుగులు దిద్దిన సీఎం జగన్

ఆర్థిక శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు…….

jagan mohan reddy
jagan mohan reddy, AP CM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూర్పుకు రంగం సిద్ధమైంది. బడ్జెట్ రూపకల్పనకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల మంత్రులతో సమావేశమైన బుగ్గన బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. 
తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పైనాన్ష్ శాఖ కార్యదర్శులతో బడ్జెట్ రూపకల్పనపై చర్చించారు. 


బడ్జెట్ ఏఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశంపై జగన్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆదేశించారు. 


అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని ఆదేశించారు. పెన్షన్ల పెంపు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు నిధులు పెంచాలని ఆదేశించారు. 


రైతులకు పెట్టుబడి సాయంగా వైయస్ఆర్ రైతు భరోసా, డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగుల వేతనాల పెంపు, అమ్మఒడి పథకం, గృహనిర్మాణానికి నిధులు అధికంగా కేటాయించాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. 


ఇకపోతే జులై 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జూలై 12న వైయస్ జగన్ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజా ఏపి వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/