జగన్ ను షాక్ ఇచ్చిన ఉద్యోగులు..సీపీఎస్ రద్దు చేయాలంటూ ధర్నాలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్ర ఉద్యోగులు షాక్ ఇచ్చారు. పీఆర్సీ అమలు చేయకపోయినా, డీఏల పెండింగ్‌లో ఉన్నా, వివిధ రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కానీ తొలి సారిగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు కోసం ధర్నా బాట పట్టారు. 2019 ఎన్నికలకు ముందు సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఉద్యోగ వర్గం వైసీపీకి అండగా నిలిచింది.

కానీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్న సీపీఎస్ రద్దు ఊసే లేదని వారంతా రోడ్డెక్కి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు, ధర్నాలతో ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకు పింఛన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీపీఎస్‌ రద్దు హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.

సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి క్షణంలో పని. కానీ ఆ కారణంగా పడే భారం మాత్రం భరించలేనంత ఉంటుంది. సీపీఎస్ స్కీమ్‌లో చేరేందుకు పీఎఫ్ఆర్‌డీఏ చట్టంతోపాటు ఈ చట్టం అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ఏకపక్షంగా బయటకు రావాలంటే నిధుల విత్‌డ్రాలో అనూహ్యమైన, అవాంఛనీయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాతీయ పెన్షన్‌ పథకం ట్రస్టు కమిటీది కూడా అదే అభిప్రాయం. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయి.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఒకే ఆప్షన్ ఉందని నిపుణులు అంటున్నారు. దాని ప్రకారం ప్రత్యేకహోదా విషయంలో చెప్పినట్లుగా హోదా పేరు లేకుండా ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని చెప్పినట్లుగా… సీపీఎస్ రద్దు అనే పేరు లేకుండా ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చి సీపీఎస్ ఉద్యోగుల్ని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యమవుతుందా..లేదా అనేది చూడాలి.