నిరసన చేసుకోండి.. కానీ పాదయాత్రను అడ్డుకోవద్దుః డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ

ap-dgp-requests-not-to-trouble-farmers-padayatra

అమరావతిః మీ నిరసనలు మీరు చేసుకోండి. కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నామని, కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని చెప్పామని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడా తీవ్ర సమస్యలు ఎదురుకాలేదని అన్నారు. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.

రైతుల పాదయాత్ర కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారడానికి పోలీసులే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని, అది పూర్తిగా అబద్ధమని అన్నారు. తాము సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తాం తప్పితే, దానిని మరింత జటిలం చేయబోమన్నారు. అడ్డంకులు సృష్టించడానికి తమకేం పని అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగిందని, అదనపు బందోబస్తు కూడా కల్పించామని, కాబట్టి పాదయాత్రపై ఆందోళన అవసరం లేదని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/