శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

నరసరావుపేటలో విగ్రహాల ధ్వంసం వార్తలో నిజం లేదు..ఏపి డీజీపీ

Gautam Sawang
Gautam Sawang

అమరావతి: సోషల్ మీడియా ద్వారా కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులు, సమాచారాన్ని కొందరు ఏమాత్రం నిర్ధారించుకోకుండానే షేర్ చేస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. దేవాలయాలపై దాడులు, దొంగతనాలకు సంబంధించి నిన్న కర్నూలులో మూడు, గుంటూరు రూరల్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసును ఛేదించినట్టు తెలిపారు.

అలాగే, అంతర్వేది సహా రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఇటువంటి నేరాలకు సంబంధించి 33 కేసులు నమోదు కాగా 27 కేసులను ఛేదించినట్టు వివరించారు. ఇందులో భాగంగా మూడు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోకుండా ఉండిపోయిన ఇలాంటి 76 కేసుల్లో 178 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీటిలో ఏ కేసులోనూ ఒకదానితో మరో దానికి సంబంధం లేదని, అయినా ఉన్నట్టే నమ్మబలుకుతూ ప్రచారం చేస్తున్నారని డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి వాటిని సహించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/