ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పీఆర్సీ నివేదిక అందజేసిన కమిటీ

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు.

ఈ భేటీ అనంతరం సమీర్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఉద్యోగ సంఘాలకు కూడా నివేదిక పంపిస్తామని, సీఎం జగన్‌కూ పీఆర్సీపై నివేదిక ఇచ్చామని చెప్పారు. 72 గంటల్లో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని, ఈ పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై రూ. 10 వేల కోట్ల భారం పడుతుందన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిపారు.

ఇక, ఏపీలో పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల నుంచి మిశ్రమ రియాక్షన్ వచ్చింది. మొదటి నుంచి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నివేదిక పెదవి విరిచారు. సీఎస్ చెప్పిన విధంగా చూస్తే ఫిట్‌మెంట్‌ చాలా తక్కువగా ఉందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి కలుస్తామని వెల్లడించారు.