ఏపీ సచివాలయంలో జరుగుతున్న భారీ స్కామ్ గుట్టు రట్టు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న భారీ స్కామ్ ను ఏసీబీ బట్టబయలు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ జరిగినట్లుగా విచారణలో గుర్తించారు. సచివాలయంలోనే పని చేసే కొందరు సిబ్బంది పేదల డేటా సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధులు పక్క దారి పట్టించారని రుజువైంది. ఇందులో సచివాలయ సిబ్బందితో పాటుగా ప్రజా ప్రతినిధులు పీఏలు .. వారి అనుచరుల పాత్ర పైనా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో పలువురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది.

తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRF నిధులు నొక్కేసినట్లు తేల్చారు. CMRFలో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీసీఎంఆర్ఎఫ్‌లో సబార్డినేట్లగా పనిచేస్తున్న చదలవాడ సుబ్రహ్మణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించారు. కోటి రూపాయలపైనే అక్రమ లావాదేవీలని బ్యాంకు అకౌంట్ల ద్వారా గుర్తించారు. ఏడేనిమిదేళ్లగా CMRF నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది.