విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
ఈ సదస్సుకు బ్రాండ్ అంబాసిడర్ జగనేనన్న మంత్రి అమర్ నాథ్

ap-cm-jagan-unveils-global-investors-summit-logo

అమరావతిః ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు సంబంధించిన లోగోను సిఎం జగన్ మంగళవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. 2023 మార్చి 2, 3, 4 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంతో పాటుగా ఆయా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

కరోనా కారణంగా గడచిన రెండేళ్లలో ఈ తరహా సదస్సులను నిర్వహించలేకపోయామని అమర్ నాథ్ తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగనే వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఎవరితో పడితే వారితో తమ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోదని చెప్పిన మంత్రి…. పెట్టుబడులు పెట్టే సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/