పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్ చదువు

తమ పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య కావాలని తల్లిదండ్రులే కోరారు

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ వైఎస్‌ఆర్‌సిపి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రోజుకో అంశంపై మేధోమథనం నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈరోజు విద్యా రంగంపై ఏపి ప్రభుత్వం నిర్వహిస్తోన్న సదస్సులో ఆయన మాట్లాడారు. ‘పేద విద్యార్థులను కూడా ఉన్న చదువులు చదివించాలి. చాలా మంది తమ పిల్లలను చదివించే స్తోమత లేక మధ్యలోనే ఆపుతున్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతాఇంతాకాదు. కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువుల కోసం తండ్రి పడుతున్న అప్పుల బాధను భరించలేక అతడు ఆ చర్యకు పాల్పడ్డాడు. మంచి చదువులు చదవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు చదవలేకపోతున్నారు’ అని జగన్ అన్నారు.

‘పేదవారు పేదరికం నుంచి బయటకు ఎప్పుడు వస్తారంటే.. ఆ పేదవారి కుటుంబంలో పిల్లలు కలెక్టరో, లేదా ఓ పెద్ద ఉద్యోగమో చేస్తే పేదరికం నుంచి బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికీ వారు పేదరికంలోనే ఉంటారు. పేదరికానికి ఉన్న ఏకైన సొల్యూషన్ చదువు. పిల్లలను చదివించలేకపోతోన్న తల్లిదండ్రులు ఉన్న ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఇంగ్లిషు మీడియంను తీసుకు వస్తున్నాం’ అని తెలిపారు. తమ పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య కావాలని తల్లిదండ్రులే కోరారని జగన్ చెప్పారు. ఇటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ అన్నారు. ఈసదస్సులో ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/