నేడు వైస్సార్సీపీ మంత్రివర్గ సమావేశం..పలు నిర్ణయాలకు ఆమోదం

మరికాసేపట్లో వైస్సార్సీపీ మంత్రివర్గ సమావేశం మొదలుకాబోతుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. పలు అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చర్చించి ఆమోదిస్తారని తెలుస్తుంది. అలాగే ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం, దేవాదాయ భూముల ఆక్రమణల నిరోధానికి చట్ట సవరణ ప్రతిపాదన లపై చర్చిస్తారని సమాచారం.

ఈ నెల 27 తేదీన ‘అమ్మఒడి’ పథకం నిధుల విడుదలకు కేబినెట్​ ఆమోదం తెలపనుంది. బైజుస్​తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్​ల పంపిణీ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం ఉంది. 35 సంస్థలకు 112 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్టు సమాచారం. పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఆమోదం జరిగే అవకాశం ఉంది. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి తెలపనుంది. కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.