ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..

సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్‌ రూ.4 వేల పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డీఎస్సీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది.

పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జూలై 1 తేదీ నుంచి 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి 7 వేలు అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ – 6 పథకాల అమలు, అందుకు అణుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం.