ఏపీ మంత్రివర్గ సమావేశ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గురువారం మంత్రివ‌ర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించాలని, ప్రజలు సమస్యలు వివరిస్తే తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇక మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు చూస్తే..

  • మ‌డ‌క‌సిర‌లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
  • పెనుగొండ‌లో టూరిస్ట్ క్యాంప‌స్ కోసం భూమి కేటాయింపు
  • నెల్లూరులో దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి పేరిట యూనివ‌ర్సిటీ
  • నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో బ‌యోఇథ‌నాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
  • వైఎ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ఆస్ప‌త్రి నిర్మాణానికి భూమి కేటాయింపు
  • సంక్షేమ క్యాలెండ‌ర్‌కు అనుగుణంగా ప‌థ‌కాలు
  • పామ‌ర్రులో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ ఆధునికీక‌ర‌ణ‌
  • పులివెందుల‌లో మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో నియామ‌కాల‌కు ఆమోదం
  • తిరుప‌తి జిల్లాలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి అంబటి అన్నారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలోకంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్‌ రూపొందించి పాటిస్తున్నామని మరో మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా కు వెల్లడించారు. ఈనెల 16న మత్స్యకార భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈనెల 19న యానిమల్‌ అంబులెన్స్‌ ప్రారంభిస్తామని తెలిపారు. జూన్‌ 6న వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తామని చెప్పారు.