పవన్ కళ్యాణ్ కు షాక్ : శ్రమదానానికి అనుమతి నిరాకరణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు అధికారులు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై రోడ్డు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నారు. అయితే శ్రమదానానికి అనుమతి నిరాకరించారు అధికారులు.

కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న, కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. మరోవైపు బ్యారేజీపై శ్రమదానం చేసి తీరతామని చెబుతున్నారు జనసేన కార్యకర్తలు.

ఇక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేయాలని భావించారు. అక్టోబర్ 02 ఉదయం 10గంటలకు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు , మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. మరి ఇప్పుడు కాటన్ బ్యారేజీపై మరమ్మతులకు అధికారులు నిరాకరించడం తో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.