ఐదో రోజు ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు సమావేశాలు మొదలు కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వెంటనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ నేతలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారని నిరసనకు దిగారు.

మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్‌కు ఢిల్లీ గుర్తుకొస్తుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అడిగినందుకే ఆదివారం కూడా సభ పెట్టామని మంత్రి తెలిపారు.