ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు

AP assembly meetings from 22nd of this month

అమరావతిః ఈ నెల 22వ తేదీ నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సారి సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. అయితే.. ఈ సమావేవాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా.. మూడు నెలల పాటు తాత్కాలిక బడ్జెట్‌ కోసం సమావేవాల్లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్థికశాఖ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై ఆలోచనలు చేస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్‌ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధశాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.