టెన్త్ ఫలితాలపై వైస్సార్సీపీ -టీడీపీ ట్విట్టర్ వార్..

ఏపీలో టెన్త్ ఫలితాల ఫై వైస్సార్సీపీ – టీడీపీ పార్టీల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్ధుల్ని పదో తరగతి పరీక్షలు పెట్టకుండానే పాస్ చేస్తూ వస్తున్న ప్రభుత్వానికి ఈసారి మాత్రం పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఉత్తీర్ణతలు సవాల్ గా మారింది. ఇందులో పరీక్షల నిర్వహణ విషయంలో లీకులు, మాస్ కాపీయింగ్ తో ప్రభుత్వం అభాసుపాలు కాగా.. ఫలితాల వెల్లడి మాత్రం నెలరోజుల్లోపే పూర్తి చేసింది. ఉత్తీర్ణత విషయానికి వచ్చేసరికి 20 ఏళ్ల కనిష్టానికి చేరుకుని 67.26 శాతంగా నమోదైంది. ఏకంగా 71 స్కూళ్లలో జీరో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. మొత్తంగా 2 లక్షలకు పైగా విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. కోవిడ్ కారణంగా విద్యార్ధులు అంతకు ముందు రెండేళ్లు ఇళ్లకు పరిమితం కావడం వల్లే ఈసారి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడిండనై బొత్స చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ మాత్రం టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. స‌ర్కారు ఫెయిల్యూర్ అని మండిపడింది.

అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని త‌గ్గించే కుట్ర అంటూ నారా లోకేష్ అగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కుట్ర‌తోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని ఆయన ధ్వజమెత్తారు. తొలిసారి నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌లు పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, మాల్ ప్రాక్టీసుల‌తో అభాసుపాలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టెన్త్ రిజ‌ల్ట్స్‌ వాయిదా, దిగ‌జారిన ఫ‌లితాలన్నీ స‌ర్కారు కుతంత్ర‌మేనని, నాడు నేడు పేరుతో రూ. 3500 కోట్లు మింగేసి విద్యావ్య‌వ‌స్థను నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. టీచ‌ర్ల‌కి త‌న వైన్‌షాపుల వ‌ద్ద డ్యూటీ వేసే శ్ర‌ద్ధ విద్య‌పై సీఎం ఎప్పుడూ దృష్టి పెట్టలేదంటూ లోకేష్ విమర్శించారు.

లోకేష్ ట్వీట్ కు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావు. చదువు’కొన్న’వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి..? అని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం టెన్త్ ఫలితాల గురించి అంత మాట్లాడుకుంటున్నారు.

నిన్న విజయవాడలోని గేట్ వే హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ వీటిని ప్రకటించారు. మొత్తం 4,14,281 లక్షల మంది పాస్ అయ్యారని , 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారని , టెన్త్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు తెలిపారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు తెలిపారు.