‘సంక్షేమ మండలి’తో కార్మికులకు భరోసా ఏదీ ?
పనులు లేక తీవ్ర ఇబ్బందులు

దేశంలో వ్యవసాయరంగం తర్వాత ప్రజలకు ఉపాధి కల్పించే రెండవ అతిపెద్ద రంగం భవన నిర్మాణ రంగం. అలాంటి భవన నిర్మాణ రంగం నేడు చతికిల పడిపోయింది.
ఒకవైపు ఇసుక కొరత మరోవైపు కరోనా మహమ్మారి రెండు కలిసి భవన నిర్మాణ కార్మికుల జీవితాలు చిదిమేశాయి.
కరోనా లాక్డౌన్ కు ముందు అరకొర పనులు దొరికేవి. లాక్డౌన్ తర్వాత వారి జీవితాలు కూడా లాక్డౌన్ అయ్యాయి.
కార్మికుని రెక్కాడితే కానీ వారి కుటుంబాలకు డొక్కాడవు.
అలాంటి దయనీయ కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులవి. ఏడాది నుంచి ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్మికుల బతుకులు దినదినగండంగా గడుస్తున్నాయి. పనులు దొరక్క విలవిల్లాడుతున్నారు. అడ్డాలలో పనులు కోసం ఎదురు చూస్తున్నారు.
ఎక్కడ పని దొరుకుతుందా, పూట గడవడానికి పైసలు దొరుకుతాయని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తు న్నారు. కానీ పని మాత్రం దొరకడంలేదు. ఆకలితో అలమటిస్తున్న దయనీయ పరిస్థితి వారిది.
కార్మికశాఖ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 లక్షలపై చిలుకు కార్మికులు గుర్తింపు పొందిన భవన నిర్మాణ రంగ కార్మికులున్నారు.
గుర్తింపు లేని వారి సంఖ్య గుర్తింపు ఉన్న సంఖ్య కంటే రెండు,మూడురెట్లు అధికంగా ఉంటుంది. ఎందుకంటే భవన నిర్మాణ రంగం అంటే తాపీ పని వారు మాత్రమే కాదు.
అందుకు అవసరమయ్యే 57 రకాల వృత్తుల వారు కూడా పనిచేస్తున్నారు. అవగాహన లోపంతో చాలా మంది కార్మికశాఖ వద్ద నమోదు చేసుకోలేదు.
గతంలో ఎలాంటి హక్కులు లేకుండా పనిచేసి ప్రమాదాల బారినపడిన వారు అనేకం. భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మిక సంఘాలు సుదీర్ఘకాలం పోరాటం చేశాయి.
పోరాట ఫలితంగా భవన, ఇతర నిర్మాణరంగం కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేకంగా భవన నిర్మాణ సంక్షేమ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆ సంక్షేమ మండలికి భవన నిర్మా ణాలు చేసే యాజమానులు భవన నిర్మాణ విలువలో ఒక్కశాతం సంక్షేమ మండలికి కార్మికుల సంక్షేమం కోసం చెల్లిస్తున్నారు.
ఆ విధంగా కార్మిక సంక్షేమ మండలి ఇప్పటివరకు దాదాపు వెయ్యి కోట్లకుపైగా నిధులు సమకూర్చింది.
భవన నిర్మాణ రంగ కార్మికులకు కరోనాతో ఉపాధి లేక బక్కచిక్కిన కార్మికులకు సంక్షేమ నిధి ద్వారా ఎటువంటి ఉపశమనం లభించలేదు.
ఎలాంటి సంక్షేమ మండలి లేని ఆటో డ్రైవర్లు, టైలర్లు, ఇతరులకు ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది.
సంక్షేమ మండలిలో కార్మికులకు సంబంధించిన డబ్బు అందులో నిల్వ ఉండి కూడా కార్మికులకు ప్రయోజనం జరగలేదు.
గతంలో గుర్తింపు పొందిన ప్రతికార్మికునికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు కార్మికశాఖలో కార్మికుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.
కార్మికశాఖ వద్ద నమోదు చేసుకున్న కార్మికుల అందరి పూర్తి వివరాలను ఇప్పటివరకు వారి దగ్గర అందుబాటులో లేవ్ఞ. కార్మికశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 లక్షలపై చిలుకు కార్మికులు ఉన్నారు.
వారిలో సుమారు 7.5లక్షలు మంది ఇప్పటి వరకు ఆధార్ నమోదును పూర్తి చేయలేదు. అంటే కార్మికుల కోసం కార్మికశాఖ ఎంత గొప్పగా పనిచేస్తుందో అందరికీ అర్థమవుతుంది.
కార్మికుల వివరాలే లేకుంటే సహాయం అందించేది ఎప్పుడు అన్న ప్రశ్న ఉత్పన్నం అవ్ఞతుంది. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాటదేవుడెరుగు.
కాని సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు.
అధికారులు చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూపించి కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారు. నిధులు దారి మళ్లీపోతు న్నాయి.
కానీ అసలైన లబ్ధిదారులకు మాత్రం అందడం లేదు. గడ్డపార గాలికి వెళ్తుంటే గుండు సూదిని పట్టుకొని వేలాడుతున్న ట్లుగా అధికారుల పరిస్థితి కన్పిస్తుంది.
బినామీ పేర్లతో నకిలీ రికార్డులతో కోట్ల రూపాయలు కాజేసిన గనులున్నారు. కానీ నిజాయితీగా అసలైన లబ్ధిదారులకు ఫలితం ఇవ్వాల్సిన చోట మాత్రం అధికారులకు అవరోధాలు ఎదురవ్ఞతున్నాయి.
భవన నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఒక దిక్కు. అలాంటిది నేడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంది.
పాలకులు వచ్చిన ప్రతిసారి వారి విధానాలు మార్చుకుంటూపోతున్నారు. పాలకుల విధానాలతో కార్మికులు నిర్మాణ పనులు లేక వీధినపడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు.
మరోపక్క ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి. ప్రభుత్వాలు భవన నిర్మాణరంగం కార్మికుల పరిస్థి తులపై దృష్టి సాధించలేదు.
కేంద్రప్రభుత్వం గతంలో ప్రకటించిన నిర్మల్ భారత్ ప్యాకేజీలో భవన నిర్మాణ కార్మికులకు ఊరట లభిస్తుందని ఆశగా చూశారు.
20 లక్షల కోట్లు అంటే కార్మిక రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని అందరూ భావించారు.
కానీ అక్కడ కార్మికులకు లాభం చేకూరకుండా పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూరింది. భవన నిర్మాణ రంగం కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదు.
ప్రభుత్వం భవన నిర్మాణ రంగం కార్మికుల పట్ల ఆలోచించాలి. ఇసుక పాలసీని సులభమార్గంలో అందుబాటు లోకి తీసుకువచ్చి పనులు కల్పించాలి.
అదేవిధంగా ఇప్పటివరకు నమోదు చేసుకొని, ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుని పరిహారం, ఇతర సంక్షేమ పథకాలు కూడా అందిస్తే భవన నిర్మాణ సంక్షేమ మండలికి సార్ధకత చేకూరుతుంది.
- ఎస్.శంకరాంజనేయులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/