ఇంట గెలిచి రచ్చ గెలవాలి

వ్యధ: మానసిక సమస్యలకు పరిష్కార వేదిక

Anxiety- psychological problems
Anxiety- psychological problems

నేను బాగా చదువుకున్న వ్యక్తిని, బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. కారణం నా కుటుంబాన్ని చక్కదిద్దుకోలేక పోవడమే.

నేను ఎం.ఎ చదివాను. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పౌరశాస్త్రం బోధిస్తున్నాను. అయితే తాగుబోతు భర్తను మార్చుకోలేక నరకం అనుభవిస్తున్నాను.

ఇప్పుడు కూతురి ప్రేమ వ్యవహారం, కొడుకు వ్యసనాలను కట్టడి చేయలేక సతమతమవుతున్నాను.

తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటే తప్ప నా సమస్యలకు పరిష్కారం దొరకదన్న భావనకు లోనవుతున్నాను.

నేను చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినప్పటికి ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల డిగ్రీ వరకు చదవుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. అతను చిన్న చిన్న కాంగ్రాక్టులు చేసుకునేవారు.

మా పెళ్లయిన తరువాత నా జీతం కూడా తోడవడంతో ఐదారు సంవత్సరాలు బాగానే సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించారు.

ఒక కూతురు, కొడుకు పుట్టిన తరువాత వారి పెంపకమే లక్ష్యంగా భావించి ఆయన్ను నిర్లక్ష్యం చేశాను. ఈ నేపథ్యంలో ఆయన మరొక ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అలాగే త్రాగుడు అలవాటు చేసుకున్నారు.

దీని వల్ల వారంలో నాలుగు రోజులు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీనివల్ల పిల్లలు జడుసు కోవడం,ఏడవడం చేసేవారు. రానురాను ఆయన ఒక్కోరోజు ఇంటికి రాకపోవడం చేసే వారు.

నా బతుకు పాడుచేస్తున్న మా వారి వివాహేతర సహజీవన ప్రియురాలితో కూడ గొడవ పడ్డాను. ఆమె ఏ మాత్రం భయపడకుండా చేతనైతే మొగున్ని కట్టడి చేసుకోమని హెచ్చరించింది.

దీనిపై మా సహోద్యోగిను లను సంప్రదించగా పట్టించు కోవడం మానేసి. సర్దుకుని పిల్లలు, సంసారం చేయ మన్నారు.

కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని, ఈ విషయం నలుగురికి తెలిసే నవ్వుల పాలు కావాల్సి ఉంటుదని వివరించారు.

అయినా మా గొడవలు తగ్గ లేదు నేను పిల్లలకోసం నా జీవితం డబ్బు పొదుపు చేయడం ప్రారంభించాను. ఆ డబ్బు ఇవ్వమని బెదిరించడం ప్రారంభించారు.

పలుసార్లు కొట్టడం కూడా జరిగింది. దీంతో అప్పుడప్పుడు అలిగి పిల్లల్ని తీసుకుని ఊరిలోనే ఉన్న పుట్టింటికి వెళ్లేదాన్ని. నెల, రెండు నెలలు అక్కడేవుండి,

మళ్లీ పెద్దల మాటవిని భర్త ఇంటికి వెళ్లేదాన్ని. ఈ క్రమంలో మా అమ్మాయి గాలికి తిరిగే అబ్బాయితో ప్రేమలో పడింది. ఆమె బి.టెక్‌ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నది.

ఆ అబ్బాయి ఇంటర్‌ ఫెయిలై అదే కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.

భర్త మద్దతు, రక్షణ లేని నేను ఆమెను నియంత్రించలేక పోయాను. ఏడాది తరువాత అతని తీరునచ్చలేదని ప్రేమ బంధం తెంచుకున్నది.

అతను ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు చూపి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. పోలీసుల సహకారంతో అతని బాధ నుంచి బయట పడ్డాము.

మళ్లీ ఒక అనామకునితో తిరుగుళ్లు ప్రారంభించింది. ఇదిలా ఉండగా మా అబ్బాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను ఇంటర్‌ చదువుతున్నాడు.

తొమ్మిదవ తరగతి నుంచే ట్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.

ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. దానికి నా భర్తను బాధ్యున్ని చేసి తిట్టి ఊరుకునేదాన్ని.

ఇటీవల మావాడు, అతని స్నేహి తులు కలిసి రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఒక మహిళ కళ్లల్లో కారం చల్లి మెడలోని నగలు లాక్కుని పారిపోయారు.

వారం రోజుల్లో పోలీసులు ఛేదించి వీరిని పట్టుకున్నారు. నన్ను మా వారిని స్టేషన్‌కు పిలిపించి మంద లించారు. పిల్లలపై కేసుపెట్టారు

. మేము విధిలేక బెయిలోపై మా వాడిని విడిపించాము. అయినా వాడి తీరుమారలేదు. మాధక ద్రవ్యాల కోసం డబ్బు అడగడం ఇవ్వనంటే బూతులు తిట్టడం చేస్తున్నాడు.

నాభర్త నేను, నా కూతురి వల్లనే తాను చెడి పోయానని నిందిస్తు న్నాడు. ఈ దశంలో ఎవరినీ మార్చు లేక, ఏమీ చేయలేక కుమిలి పోతున్నాను. నా సమస్యకు పరిష్కారం చూపగలరు.

ప్రభావతి, ఒక సోదరి

అమ్మా, మీ వ్యధ అర్థమయ్యింది. పిజిలు చేయడం, పాఠాలు చెప్పడం వేరు, కుటుంబ నిర్వహణవేరు. అందుకే మన పెద్దలు సంసారాన్ని సాగరంతోను, చదరంగంతోను పోల్చారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు.

అంటే కుటుంబ నిర్వహణకూడా చాల సంక్ష్లిష్టమని అర్థం కాబట్టి ఎం.ఎ చదివి పౌరశాస్త్రం బోధిస్తున్న మీరు కుటుంబాన్ని చక్క దిద్దుకోలేక పోయామన్న కృంగుబాటు నుంచి బయటపడండి.

భర్తదారి తప్పడానికి భార్యే కారణం కావాల్సిన పనిలేదు. అతని వ్యక్తిత్వం, జీవన శైలి, పరిసరాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి.

అయితే భార్య తెలివైనదట్లయితే ఆదిలోని గుర్తించి చక్కదిద్దుకోవచ్చు. సహజంగా ఇలాంటి వ్యవహారాలు ముదిరిన తరువాతనే బయటపడతాయి.

కాగా మీ పిల్లలు దారి తప్పడంలో మీ కుటుంబ కలహాల పాత్ర ఉంది. అలాగే ఆధునిక జీవనశైలి, సామాజిక పోకడలు, మీడియా తదితర అంశాలు వారిని ప్రభావితం చేశాయి. మీ లాంటి వారు మనసును దృడపరచుకోవాలి.

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.మీకు మంచి జీతం వస్తుంటుదని భావిస్తాను. కాబట్టి ఎవరిమీదా ఆధారపడకుండా జీవించగలరు.

ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని అందరినీ బాగుచేయడానికి పూనుకోండి. మీ భర్తతో కలసి ఉంటారో,లేదో తేల్చుకునే స్థాయిలో గంభీరంగా మాట్లాడండి.

ఇష్టం లేకుంటే విడాకులు ఇచ్చేయ మనండి. పరువు పోతుందన్న భయం లేదండి. పరువు భయం ఆయానకు ఉంటుంది కదా! దారికి వస్తాడు.

అందరూ కలిసి అనుభవం ఉన్న సైకాలజిస్టును కలవండి కనీసం ఐదారు తడవలైనా కౌన్సెలింగ్‌ చేయించుకోండి. మీ అమ్మాయిని, భర్తను సులభంగానే మార్చవచ్చు.

మీ అబ్బాయికి అవసరం అనిపిస్తే డిఅదిక్షన్‌ సెంటర్‌లో చికిత్స చేయిం చండి. మీరు కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానేసి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి.

మిమ్మల్ని కాదని మీ పిల్లలు బ్రతకలేరు. ఆ విషయ వారికి తెలిసివచ్చేలా ప్రవర్తిస్తూ అనునయించండి. సమస్యలన్నీ ఒక దారికి వస్తాయి.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/