మమతా బెనర్జీకి బిగ్ షాక్‌.. అనుబ్రత్‌ మండల్‌ అరెస్ట్

పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కి బిగ్ షాక్ ఇచ్చారు సిబిఐ. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, బీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడైన అనుబ్రత్‌ మండల్‌ (62)ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా బోల్‌పుర్‌లోని తన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన పశువుల స్మగ్లర్ల నుంచి డబ్బు తీసుకొని, వారికి రక్షణ కల్పించేవారన్నది అభియోగం.

పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. ఇప్పుడు అనుబ్రాత మండల్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పశువుల అక్రమ రవాణా కేసులో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసినా మండల్‌ హాజరుకాలేదు. దీంతో గురువారం బిర్భుమ్‌ జిల్లాలోని ఆయన నివాసానికి 30 కార్ల కాన్వాయ్‌తో వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు గంటసేపు మండల్‌ను ఓ గదిలో ఉంచి మరి ఈ తనిఖీలు జరిపారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు.

ఈ కేసులో సీబీఐ అనుబ్రత్‌కు 10 సార్లు సమన్లు జారీ చేసింది. అనారోగ్య సమస్యలను కారణంగా చూపి విచారణకు ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. మండల్‌కు 14 రోజులపాటు విశ్రాంతి అవసరమని ధ్రువీకరించిన బోల్‌పుర్‌ ఆసుపత్రి వైద్యుణ్ని కూడా విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. ఆసన్‌సోల్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుబ్రత్‌ను పది రోజుల కస్టడీకి ఆదేశించింది. బీర్‌భూం జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా అనుబ్రత్‌ మండల్‌ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి.