బిజెపి కి మరో షాక్..బహిరంగ సభకు ఆర్ట్స్ కాలేజీ అనుమతి నిరాకరించింది

హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27న బిజెపి భారీ బహిరంగ సభ ఏర్పటు చేయాలనీ అనుకున్నది. అయితే ఈ సభకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ షాక్ ఇచ్చారు. కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు. ఈ మేరకు గురువారం (ఆగస్టు 25) సాయంత్రం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారెడ్డికి లేఖ రాశారు. సభ కోసం బీజేపీ చెల్లించిన రూ.5 లక్షలను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. అనుమతులకు సంబంధించి పోలీసుల నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని.. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పుడు సభ వేదికను మారుస్తారా..లేక అనుమతి తెచ్చుకుంటారా అనేది చూడాలి.

మరోపక్క బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి నుండి తిరిగి ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. కాకపోతే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎల్లుండి ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకోనున్నారు.