ఏపీ ప్రజలకు మరో తూఫాన్ హెచ్చరిక

మండూస్ తుఫాన్ నుండి ఇంకా రాష్ట్ర ప్రజలు బయటపడక ముందే మరో తూఫాన్ హెచ్చరిక ఖంగారుకు గురిచేస్తుంది. మండూస్ తుఫాన్ కారణంగా గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వేలాదిమంది రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక ఇప్పుడు మరో తూఫాన్ రాబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమ లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.