మళ్లీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

నిజామాబాద్ లో బొంత సుగుణ అనే మహిళ అరెస్ట్

TRS MLA A Jeevan Reddy

హైదరాబాద్ః బిఆర్ఎస్ కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు మరోసారి కుట్రపన్నిన ఉదంతం తాజాగా నిజామాబాద్ లో వెలుగు చూసింది. గతంలో ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేసిన నిందితుడు ప్రసాద్ గౌడ్ తాజాగా ఈ కుట్రకి సూత్రధారి అని తెలిసింది. ఈ కేసులో నిజామాబాద్ లోని కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బొంత సుగుణ (41) అనే నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హత్య కోసం ఆమె ఇంట్లో నిల్వచేసిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ లాంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ గతంలో కూడా హత్యాయత్నం చేశాడు. తుపాకీతో గత ఆగస్టు నెలలో నేరుగా హైదరాబాదులోని ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డాడు. అతడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేయగా, విచారణలో నిజామాబాద్ కు చెందిన బొంత సుగుణ అనే మహిళకు తుపాకీ కొనడం కోసం రూ. 60 వేలు ప్రసాద్ గౌడ్ పంపినట్లుగా తెలిసింది. దీంతో ఆమెను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు.

కానీ, నెల రోజులకు వీరిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎలాగైనా జీవన్ రెడ్డిని హత్య చేయాలని పథకం వేశారు. ఇతర వ్యక్తుల ద్వారా పేలుడు పదార్థాలు సమకూర్చగా.. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అంతకుముందు కేసులో నిందితురాలుగా ఉన్న బొంత సుగుణ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు పట్టుబడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రసాద్ గౌడే గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా పేలుడు పదార్థాలను తనకు పంపించాడని ఆమె విచారణలో ఒప్పుకుంది. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 37 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బొంత సుగుణను ఏ1గా, ప్రసాద్ గౌడ్ ను ఏ2లుగా చేర్చారు.